డబ్బులు ఇవ్వకపోతే పౌరసత్వం లాగేసుకుంటాం.. ఓటర్ల గుర్తింపు ప్రక్రియలో బెదిరింపులు!

  • ఝార్ఖండ్ ఓటర్ వెరిఫికేషన్‌లో అక్రమ వసూళ్లు
  • రూ. 50 నుండి రూ. 100 డిమాండ్
  • ఖర్చా-పానీ పేరిట బిఎల్‌వో వసూళ్లు
  • డబ్బులు ఇవ్వకుంటే పౌరసత్వం రద్దని బెదిరింపులు
ఎన్నికల సంఘం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (ఎస్ఐఆర్) ఓటర్ల వెరిఫికేషన్ ప్రక్రియలో అక్రమ వసూళ్ల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఝార్ఖండ్‌లోని గర్వా జిల్లా రాంకా బ్లాక్ ఖాప్రో పంచాయతీ పరిధిలో బీఎల్‌వో అక్రమ వసూళ్ల వ్యవహారం వెలుగుచూసింది.

ఓటర్ల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి, వాటిని నింపి సమర్పించడానికి అక్కడి బూత్ లెవెల్ ఆఫీసర్ (బీఎల్‌వో) గ్రామస్థుల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో స్థానికంగా దుమారం రేగింది.

గోరాయాబంద్ తోలా ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న జమీలా బీబీ అనే మహిళా బీఎల్‌వో.. ఓటర్ వెరిఫికేషన్ ఫారాల కోసం అక్కడి నివాసితుల నుండి రూ. 50 నుండి రూ. 100 వరకు డిమాండ్ చేస్తున్నట్లు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. నేరుగా లంచం అని చెప్పకుండా, తన ఖర్చుల నిమిత్తం "ఖర్చా-పానీ" ఇవ్వాలని ఆమె ఓటర్లను అడుగుతోంది.

ఈ విషయంపై మీడియా ప్రతినిధులు సదరు గ్రామాన్ని సందర్శించి విచారించగా, గ్రామస్థులు ఈ అక్రమ వసూళ్లను నిజమేనని ధ్రువీకరించారు. ఎన్నికల సంఘం ఉచితంగా అందిస్తున్న ఈ సేవకు డబ్బులు అడగడమే కాకుండా, ఒకవేళ డబ్బులు ఇవ్వడానికి నిరాకరిస్తే "మీ పౌరసత్వాన్ని రద్దు చేయిస్తాం" అంటూ సదరు అధికారిణి బెదిరింపులకు గురిచేస్తోందని మహ్మద్ పర్వేజ్ అన్సారీ అనే స్థానిక యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

డబ్బులు ఇవ్వాల్సి వస్తుందనే భయంతో చాలామంది ఫారాలు నింపినప్పటికీ వాటిని సమర్పించడానికి వెనుకాడుతున్నారు. ఈ వ్యవహారం అంతా పెద్ద వివాదంగా మారడంతో సదరు బీఎల్‌వో జమీలా బీబీ స్పందించారు. తాను ఎవరినీ డబ్బులు అడగలేదని, తనపై కావాలనే కొందరు కుట్రపూరితంగా ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. 

తాను ఇప్పటికే 170కి పైగా ఫారాలను పూర్తి చేశానని, ఎవరికైనా అనుమానం ఉంటే లబ్ధిదారులను అడిగి తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఉచిత వెరిఫికేషన్ ప్రక్రియలో ఎటువంటి అవినీతి జరగకుండా ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

Jamila Bibi
Jharkhand Voter Verification
Voter ID Card Bribe
Special Intensive Revision
Garhwa Election Commission
Voter Citizenship Threat

More Telugu News